Orphans: రష్యా దాడులతో ఈ అనాథల గూడు చెదిరింది!
- ఉక్రెయిన్ పై రష్యా సేనల భీకరదాడులు
- జపోర్జియా అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడులు
- అనాథలను తరలించిన నిర్వాహకులు
- పోలెండ్ లో ఆశ్రయం
రష్యా భీకర దాడులు ఉక్రెయిన్ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రాణాలు దక్కించుకుంటే చాలని ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి పది లక్షల మంది ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోయారు. కాగా, ల్వీవ్ నగరంలోని ఓ అనాథాశ్రమంపైనా యుద్ధ ప్రభావం పడింది. అందులోని 215 మంది బాలల పరిస్థితి దయనీయంగా మారింది. తల్లిదండ్రులు లేనివారు, అందరూ ఉండి ఎవరూ పట్టించుకోనివారు, వీధి బాలలు, విధి వంచితులు... ఇలా అనేకమంది అనాథలకు ల్వీవ్ లోని జపోర్జియా సెంట్రల్ క్రిస్టిన్ ఆర్ఫనేజ్ ఆశ్రయం కల్పిస్తోంది.
కానీ ఇప్పుడు యుద్ధం వచ్చి వారి గూడును చెదరగొట్టింది. ఈ అనాథాశ్రమంలో ఉన్నవారిలో పసిబిడ్డల నుంచి టీనేజర్ల వరకు వివిధ వయసులవారున్నారు. రష్యా బలగాలు జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేయడంతో, ఈ అనాథలు అందరూ తమ సంరక్షణ కేంద్రాన్ని ఖాళీ చేయక తప్పింది కాదు.
దీనిపై అనాథాశ్రమం డైరెక్టర్ ఓల్హా కుచెర్ స్పందిస్తూ, అనాథలకు వచ్చిన కష్టం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని విచారం వ్యక్తం చేశారు. వాళ్లంతా ఎంతో చిన్నవాళ్లని, వారి పరిస్థితి పట్ల ఏంమాట్లాడాలో అర్థంకావడంలేదని, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియడంలేదని వాపోయారు.
కాగా, వారందరినీ గడ్డకట్టించే చలి నడుమ ఓ రాత్రి వేళ ల్వీవ్ నుంచి రైలు ద్వారా పోలెండ్ సరిహద్దులకు తరలించారు. అక్కడ్నించి ఆ చిన్నారులు బస్సుల ద్వారా పోలెండ్ లో తమ కొత్త ఆవాసానికి చేరుకునేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారిని అనాథాశ్రమం సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు.
తమ మనసులో వేదనను ఎవరితో చెప్పుకోవాలో తెలియని ఆ చిన్నారులు ఓవైపు యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలోనూ ఎంతో మౌనంగా ఉండిపోయారు. ఇది మానవతా వాదులను కలచివేసింది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ అనాథ పిల్లలు రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్న దృశ్యాలు హృదయాలను బరువెక్కించేలా ఉన్నాయి. అయితే, జపోర్జియాలో యుద్ధ సైరన్ల మోతలు, కాల్పుల శబ్దాలు, బాంబుల ధ్వనుల మధ్య ఉండడం కంటే అక్కడ్నించి వెళ్లిపోవడం తమకు సంతోషం కలిగిస్తోందని పలువురు అనాథలు తెలిపారు.
అనాథాశ్రమం డైరెక్టర్ కుచర్ స్పందిస్తూ, ఓవైపు ఉక్రెయిన్ ను వీడడం అత్యంత బాధాకరమైన అంశమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లిపోవడం వల్ల ఊరట కలుగుతోందని చెప్పారు. ఉక్రెయిన్ అంటే మాకెంతో ఇష్టం, మేం ఈ దేశాన్ని ప్రేమిస్తాం. దురదృష్టవశాత్తు వెళ్లిపోతున్నాం అని ఆమె పేర్కొన్నారు.
ఇక, తమ పిల్లలందరినీ బస్సుల్లో ఎక్కించాక, "పుతిన్ ఒక హంతకుడు" అని ఆక్రోశించారు. ఉక్రెయిన్ లో మేం బాంబు పేలుళ్ల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని రష్యా ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడంలేదో తెలియడంలేదని కుచెర్ విచారం వ్యక్తం చేశారు.
.