Russia: రష్యాకు ఆర్థిక ఆంక్షల సెగ.. నిత్యావసరాల విక్రయాలపై పరిమితి
- ఆంక్షల నేపథ్యంలో రష్యా ముందుజాగ్రత్త చర్యలు
- నిత్యావసరాలు నల్లబజారుకు తరలిపోకుండా ఆంక్షలు
- యుద్ధం నేపథ్యంలో దుకాణదారులు పెద్ద ఎత్తున సరుకుల నిల్వ
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దేశంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత చర్యలు ప్రారంభించింది. రిటైల్ అవుట్లెట్లలో నిత్యావసరాల విక్రయాలపై పరిమితి విధించింది. నిత్యావసర వస్తువులను ప్రజలందరికీ అందుబాటులో ఉంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలిపోకుండా ఈ ఆంక్షలు అడ్డుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, యుద్ధం కారణంగా ఎదురవబోయే పరిస్థితులను ముందే ఊహించిన దుకాణదారులు పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి నిల్వచేసుకున్నారు. దీంతో ధరలు పెరిగి ఇబ్బందులు తప్పవని భావించిన ప్రజలు, వాణిజ్య సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.