Harish Rao: తెలంగాణ కొత్త రూపం సంతరించుకుంది: బడ్జెట్ ప్రసంగంలో హరీశ్ రావు
- తెలంగాణను పునర్నిర్మించే బాధ్యతను కేసీఆర్ భుజాలపై వేసుకున్నారు
- కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు
- తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి సరిగా లేదన్న మంత్రి
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిమంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో తెలంగాణ అగ్రగామిగా రూపుదాల్చిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో అగచాట్లు పడ్డ తెలంగాణను పునర్నిర్మించే బాధ్యతను కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారని అన్నారు. పోరాట దశ నుంచి తెలంగాణ ఆవిర్భవించేంత వరకు ఎన్నో సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్ఎస్ రాజీలేని వైఖరిని అవలంబించిందని అన్నారు.
రైతుబంధు, ఆసరా.. ఇలా ఏ పథకమైనా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోందని హరీశ్ తెలిపారు. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవని చెప్పారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని చెప్పారు. ఖజానాకు ఎంత ధనం చేరిందనేది ముఖ్యం కాదని... ప్రజలకు ఎంత మేలు జరిగిందనేదే ముఖ్యమని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని విమర్శించారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి మొదలైందని దుయ్యబట్టారు.