Andhra Pradesh: ఈ నెల 25వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ భేటీ
- 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
- 11న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న బుగ్గన
- వైసీపీ, టీడీపీ వాదనల తర్వాత స్పీకర్ ప్రకటన
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విపక్ష టీడీపీ తరఫున సభలో ఆ పార్టీ ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న విషయంపై చర్చ జరగ్గా.. ఇరు వర్గాల వాదనల మేరకు ఈ నెల 25 వరకు సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించారు. అంటే సెలవులు మినహా మొత్తం 13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయన్న మాట. ఇందులో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.