Narendra Modi: జెలెన్ స్కీతో మీరే నేరుగా మాట్లాడండి... పుతిన్ కు సూచించిన మోదీ
- పుతిన్ తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ
- 50 నిమిషాల పాటు మాట్లాడిన మోదీ
- కాల్పుల విరమణను స్వాగతించిన వైనం
- భారతీయుల తరలింపునకు సహకరించాలని విజ్ఞప్తి
- సంపూర్ణ సహకారం అందిస్తామన్న పుతిన్
ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోనూ సంభాషించారు. పుతిన్ తో మోదీ 50 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ లో మారుతున్న పరిణామాలను ఇరువురు చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య చర్చల వాతావరణాన్ని పుతిన్ భారత ప్రధాని మోదీకి వివరించారు.
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ... ప్రస్తుతం జరగబోయే రష్యా, ఉక్రెయిన్ చర్చలకు అదనంగా పుతిన్ నేరుగా జెలెన్ స్కీతో మాట్లాడాలని సూచించారు. ఇక, కాల్పుల విరమణ నిర్ణయం ప్రకటించిన రష్యాను మోదీ అభినందించారు. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లోనూ, సుమే నగరంలోనూ మానవతా సాయానికి అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముఖ్యంగా, సుమే నగరంలో చిక్కుకున్న భారత పౌరులను వీలైనంత త్వరగా, క్షేమంగా తరలించడం యొక్క ప్రాధాన్యతను కూడా పుతిన్ కు మోదీ వివరించారు. ఈ క్రమంలో, భారతీయుల తరలింపును అన్ని విధాలుగా సహకరిస్తామని పుతిన్ ప్రధాని మోదీకి భరోసా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.