Telangana: బీజేపీని చూస్తే కేసీఆర్‌కు భయం: కిషన్ రెడ్డి
- ప్రభుత్వం దారి తప్పితే ఎమ్మెల్యేలకు ప్రశ్నించే అధికారం
- వ్యవస్థలను టీఆర్ఎస్ తీవ్రంగా అవమానిస్తోంది
- గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలా?
- టీఆర్ఎస్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసాంతం సభకు హాజరు కాకుండా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన కేసీఆర్ సర్కారు తీరుపై ఇటు బీజేపీ నుంచే కాకుండా అటు కాంగ్రెస్ నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీని చూసినా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను చూసినా కేసీఆర్ భయపడిపోతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ సర్కారు అవమానించిన రీతిన ఏ పార్టీ ప్రభుత్వం కూడా అవమానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా ఏనాడు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం దారి తప్పినప్పుడు ప్రశ్నించే అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుందని చెప్పారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజుననే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ ప్రసంగం లేకుండా సభనెలా ప్రారంభిస్తారని సభలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.