KTR: లైన్ ఉమన్ లుగా 217 మంది మహిళల నియామకం చారిత్రాత్మకం: మంత్రి కేటీఆర్
- రేపు మహిళా దినోత్సవం
- హైదరాబాదు జెన్ కో ఆడిటోరియంలో వేడుకలు
- హాజరైన కేటీఆర్, జగదీశ్ రెడ్డి
- మహిళా దినోత్సవం కేసీఆర్ కు అంకితమన్న జగదీశ్ రెడ్డి
రేపు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని జెన్ కో ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉద్ఘాటించారు.
లింగ వివక్ష లేని సమాజం ఎంతో అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో తెలంగాణ విద్యుత్ రంగం అగ్రగామిగా ఉందని కొనియాడారు. లైన్ ఉమన్ లుగా 217 మంది మహిళలను నియమించడం చారిత్రాత్మకం అని అభివర్ణించారు. ఈ నియామకాలు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు.
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నింటికీ మహిళల పేర్లే పెడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళా దినోత్సవాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.