Guntur District: నడికుడి రైల్వే స్టేషన్లో రెచ్చిపోయిన దుండగులు.. ప్రయాణికులపై దాడిచేసి రూ. 89 లక్షల దోపిడీ
- రైలు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను కొట్టుకుంటూ తీసుకెళ్లిన దుండగులు
- వారివద్దనున్న రెండు బ్యాగులు తీసుకుని సిద్ధంగా ఉన్న కారులో పరారీ
- పల్నాడులోని పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించిన రైల్వే పోలీసులు
గుంటూరు జిల్లా, నడికుడి రైల్వే స్టేషన్లో గత రాత్రి దుండగులు చెలరేగిపోయారు. రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై దాడి చేసి వారివద్దనున్న రూ. 89 లక్షలను ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుర్గి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెన్నై వెళ్లడానికి నడికుడి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రెండో ప్లాట్ఫామ్లో నిల్చుని తాము ఎక్కాల్సిన రైలు కోసం ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో గోగులపాడు వెళ్లే రోడ్డు మార్గంలోని ఖాళీ స్థలం నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. రైలు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు వ్యక్తులను సమీపించి పోలీసులు పిలుస్తున్నారంటూ కొట్టుకుంటూ వారిని ప్లాట్‌ఫామ్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. అనంతరం వారి వద్దనున్న రెండు బ్యాగులను లాక్కుని అక్కడ సిద్ధంగా ఉన్న తెల్లరంగు కారులో పరారయ్యారు.
ఆ బ్యాగుల్లో రూ. 89 లక్షలు ఉన్నట్టు పేర్లు వెల్లడించడానికి అంగీకరించని బాధితులు తెలిపారు. వ్యాపారం నిమిత్తం ఆ సొమ్ముతో చెన్నై వెళ్తున్నట్టు చెప్పారు. ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలోని పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.