petrol: పెట్రోల్ పై భారీ వడ్డన లేనట్టే.. రూ.6 వరకు పెంచే అవకాశాలు?

Rs 6 hike in fuel prices likely as polls ends

  • ఆయిల్ కంపెనీలు కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి
  • ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు సర్కారు విముఖం
  • అధిక ధరలు ఇలానే కొనసాగితే అప్పుడు పరిశీలన
  • ప్రభుత్వ నిర్ణయంపై రెండు రోజుల్లో స్పష్టత

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మంటలు పుట్టిస్తున్నప్పటికీ.. దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని భారీగా మోపేందుకు కేంద్ర సర్కారు సుముఖంగా లేనట్టు తాజా సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ సోమవారం ఒక దశలో 139 డాలర్ల వరకు వెళ్లగా (2008 తర్వాత ఇదే అత్యధిక ధర), తర్వాత 125 డాలర్లకు దిగొచ్చింది. ప్రస్తుతం 127 డాలర్లకు పైన ట్రేడవుతోంది. 

దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత నవంబర్ 4 నుంచి ధరలను సవరించడం లేదు. అప్పటి నుంచి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 50 శాతం వరకు పెరిగింది. నాడు 83 డాలర్లకు చేరిపోవడంతో కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు వ్యాట్ లను తగ్గించుకున్నాయి. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రేట్లను పెంచకుండా ఆయిల్ కంపెనీలు మౌనం పాటిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోగా, ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో లీటర్ కు ఎంత లేదన్నా రూ.15-20 వరకు పెంచొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ, కేంద్ర సర్కారు మాత్రం లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.6 వరకు పెంచుకునేందుకు అనుమతించాలన్న యోచనతో ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. అలాగే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐవోసీ, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్) లీటర్ పై రూ.12 వరకు సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆయా కంపెనీలను కోరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇన్వెంటరీ లాభాలు వస్తుంటాయి. కొనుగోలు చేసిన నాటి నుంచి, రిఫైన్ చేసి విక్రయించే నాటికి ధరలు పెరిగితే వచ్చే లాభమే ఇన్వెంటరీ లాభం. దీన్నుంచి కొంత సర్దుబాటు చేసుకోవాలని కోరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

అంతేకానీ, ఈ దశలో ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. దీనివల్ల పన్నుల ఆదాయం తగ్గిపోతుంది. ఒకవేళ చమురు ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగితే అప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కానీ, కేంద్రం తుది నిర్ణయం ఏంటన్నది వచ్చే రెండు రోజుల్లో తేటతెల్లం కానుంది.

  • Loading...

More Telugu News