YS Jagan: మహిళలకు పదవుల్లో మొదటి స్థానంలో మన ఏపీ: సీఎం జగన్
- 51 శాతం మేర పదవులు మహిళలకే
- మహిళలకు రాజకీయ సాధికారత కోసం యత్నం
- ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
- అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు హాజరు
మహిళలకు 51 శాతం మేర పదవులు ఇచ్చిన తొలి రాష్ట్రం మన ఏపీనేనని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో ఉన్నంత మంది మహిళా ప్రజా ప్రతినిధులు దేశంలోని మరే రాష్ట్రంలో లేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దేశంలో ఏపీ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉందని జగన్ చెప్పారు. ఈ మేరకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేజీ మీద, స్టేజీ ముందు, స్టేడియం నిండా, తన చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజా ప్రతినిధులేనని కూడా జగన్ చెప్పారు. గడచిన రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కాచెల్లెమ్మల కోసమే వినియోగించామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహిళల రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ వెల్లడించారు.
అంతకు ముందు తమ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసిందన్న విషయాన్ని వివరిస్తూ జగన్ రెండు వరుస ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లలో "మనది మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి ఈ 34 నెలల్లో వారి కోసం ఖర్చు పెట్టిన 1.18 లక్షల కోట్ల మొత్తమే సాక్ష్యం. వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ నియామకాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. మహిళలకు ఇంకా మంచి చేయడానికి కృషి చేస్తూనే ఉంటామని చెబుతూ చిన్నారులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వలకు, మహిళా లోకానికంతటికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని జగన్ పేర్కొన్నారు.