Russia: పుతిన్‌ను ఆపగలిగేది ఆయనొక్కరే: అమెరికన్ ఎకనమిస్ట్
- పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య స్నేహంపై స్టీఫెన్ కామెంట్లు
- రష్యా, చైనాల మధ్య బంధాలను ప్రస్తావించిన ఎకనమిస్ట్
- వాణిజ్యంతో పాటు రాజకీయ సంబంధాలు బలమైనవేనని వెల్లడి
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యా ఏ ఒక్క దేశం మాటను లెక్కచేయకుండా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రష్యా బలగాల పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్ సైన్యం. అయితే రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్‌కు నష్టం భారీగానే ఉంటోంది.
మరోపక్క, యుద్ధం మధ్యే శాంతి చర్చలు, పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొండిగానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పుతిన్‌ను నిలువరించగలిగే శక్తి ఒక్క చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు మాత్రమే ఉందంటూ అమెరికాకు చెందిన ఎకనమిస్ట్ స్టీఫెన్ చెబుతున్నారు.
సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీఫెన్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ పరిణామాల విషయంలో పుతిన్ మనసును మార్చగలిగే ప్రపంచలోని ఏకైక వ్యక్తి జిన్‌పింగ్ మాత్రమే. వాళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉంది. చైనా ఈ వ్యవహారంలో ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి నా దృష్టిలో ఇప్పుడు జిన్‌పింగ్ ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనొక్కడే ఇప్పుడు పుతిన్‌ను ప్రభావితం చేయగలరు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. రష్యాతో తమ బంధం ఎంతో బలమైందని, అందుకే ఈ వ్యవహారంలో స్థిమితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అవసరమైతే రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. మరోవైపు ఉక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యాపై పలు దేశాల ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది. ఇలాంటి తరుణంలో పుతిన్‌ను నిలువరించ గలిగే శక్తి ఒక్క జిన్‌పింగ్‌కు మాత్రమే ఉందంటూ స్టీఫెన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.