Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 500 కిలోల బాంబుతో దాడి!
- అర్థరాత్రి వేళ కూడా రష్యా బాంబు దాడులు
- జనావాసాలపైనా ఇదే తరహా దాడులు
- ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపణ
ఉక్రెయిన్ దేశంపై దండెత్తి వచ్చిన రష్యా వైఖరిని మెజారిటీ దేశాలు తప్పుబడుతున్నాయి. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని రష్యా.. ఉక్రెయిన్‌పైకి విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడులకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే బయటకు రాగా.. తాజాగా ఒళ్లు జలదరించే దృశ్యాలతో కూడిన ఫోటోలు వెలుగు చూశాయి. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగానే సాగుతున్న రష్యా.. ఉక్రెయిన్ నగరాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
బాంబు దాడుల్లో రష్యా వినియోగిస్తున్న బాంబుల సైజు, ఆ బాంబులను ప్రయోగిస్తున్న సమయం చూస్తుంటే.. ఉక్రెయిన్‌పై రష్యా ఏ మేర రగిలిపోతోందో ఇట్టే అర్థమవుతుంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో జనావాసాలపైకి మిస్సైల్స్, బాంబు దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రష్యా.. సోమవారం రాత్రి సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ భవనాలపై 500 కిలోల బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
ఈ తరహా రష్యా దాడులపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమెట్రో కులేబా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రాత్రి పూట దాడులు చేస్తున్నాయని ఆయన తెలిపారు. రష్యా సైన్యం చెర్నిహివ్ ప్రాంతంలోని జనావాసాలపైకి మరో 500 కిలోల బాంబు దాడికి పాల్పడిందని తెలిపారు. అయితే ఆ బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. రష్యా బలగాలు విచక్షణరహితంగా బాంబు దాడులు చేస్తూ మహిళలు, పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.