Andhra Pradesh: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచిన ఏపీ ప్రభుత్వం

The AP government has increased childcare leave to 180 days
  • ప్రస్తుతం 60 రోజులుగా ఉన్న సెలవులు
  • పిల్లలను దత్తత తీసుకునే వారికి కూడా సెలవుల వర్తింపు
  • పురుష ఉద్యోగులకు కూడా 15 రోజులపాటు పితృత్వ సెలవులు
  • దత్తత తీసుకునే పిల్లల వయసు నెల రోజుల లోపు ఉంటే ఏడాదిపాటు సెలవులు తీసుకునే వెసులుబాటు
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు 60 రోజులుగా ఉన్న పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గత రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలను దత్తత తీసుకునే వారికి కూడా ఈ సెలవులు మంజూరు చేస్తారు. ఇద్దరు లోపు పిల్లలు ఉన్న వారికే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

పురుష ఉద్యోగులకు కూడా ఇలాంటి సందర్భాల్లో 15 రోజులపాటు పితృత్వ సెలవులు ఇస్తారు. అయితే, పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలలలోపు మాత్రమే ఈ సెలవులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెలవులు తీసుకున్న కాలానికి వేతనం చెల్లిస్తారు. అంతేకాదు, దత్తత తీసుకునే పిల్లల వయసు నెల రోజులలోపు ఉంటే ఈ సెలవులు ఏడాదిపాటు కూడా తీసుకోవచ్చు. ఆరేడు నెలల మధ్య ఉన్నట్టయితే ఆరునెలలపాటు సెలవులు తీసుకోవచ్చు. 

ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగు సిబ్బందికి, ఎముకలు, అవయవాల పరంగా ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు, ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు ఏడాదికి ఏడు రోజులపాటు వర్తింపజేయనున్నారు. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, క్షయ, కుష్టు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవులు మంజూరు చేస్తారు. అలాగే, ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా పెంచి ఇస్తారు. 

 ఎన్జీవోల్లో మూలవేతనం రూ. 35,570కు పరిమితం చేసి ఎక్స్‌గ్రేషియా కనీస మొత్తాన్ని రూ. 11,560గా, గరిష్ఠంగా రూ. 17,780గా చెల్లిస్తారు. చివరి గ్రేడు ఉద్యోగికి కనీసం రూ. 10 వేలు, గరిష్ఠంగా రూ. 15 వేలు చెల్లించనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Andhra Pradesh
Women Employees
Leavs

More Telugu News