Ukraine: ఉక్రెయిన్ లోని కీవ్ నుంచి సురక్షితంగా బయటకు తెచ్చిన మోదీకి థ్యాంక్స్ చెప్పిన పాకిస్థాన్ బాలిక.. వీడియో వైరల్
- యుద్ధం జరుగుతున్న కీవ్ లో చిక్కుకుపోయిన ఆస్మా
- కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో తప్పించుకున్న వైనం
- త్వరలోనే స్వదేశం చేరుకుంటానని ఆశాభావం
కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఉక్రెయిన్ లోని కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. కీవ్ లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, భారత ప్రధానికి కూడా. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.