US: ఎట్టి పరిస్థితుల్లోనూ అవి రష్యా చేతికి చిక్కకూడదు.. ఉక్రెయిన్ బయో కేంద్రాలపై అమెరికా ఆందోళన
- ఉక్రెయిన్ లో జీవ పరిశోధనా కేంద్రాలు
- రష్యా చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం
- అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపిన విదేశాంగ శాఖ ప్రతినిధి
ఉక్రెయిన్ లోని జీవ పరిశోధన కేంద్రాల గురించి అమెరికా ఆందోళన చెందుతోంది. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా పైచేయి సాధిస్తూ రాజధాని కీవ్ సమీపానికి చేరుకోవడం తెలిసిందే. అతి త్వరలోనే కీవ్ రష్యా వశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ లోని జీవ పరిశోధన కేంద్రాలు రష్యా అధీనంలోకి వెళితే.. వాటిని జీవాయుధాలుగా రష్యా ఉపయోగించే ప్రమాదం ఉందని అమెరికా సందేహిస్తోంది.
అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ జీవ పరిశోధన కేంద్రాలు రష్యా స్వాధీనం కాకుండా చూడాలని అమెరికా కోరుకుంటోంది. ‘‘ఉక్రెయిన్ లో బయో పరిశోధన కేంద్రాలున్నాయి. రష్యా దళాల చేతుల్లోకి వీటి నియంత్రణ వెళుతుందన్న దానిపై ఆందోళన ఉంది’’ అంటూ విదేశాంగ శాఖ సీనియర్ ఉద్యోగి విక్టోరియా న్యూలాండ్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపారు. ఉక్రెయిన్ వద్ద జీవాయుధాలు ఉన్నాయా? అని అమెరికా చట్టసభ సభ్యులు వేసిన ప్రశ్నకు ఈ విధంగా వివరణ ఇచ్చారు.
‘‘జీవ పరిశోధనా వసతులు, మెటీరియల్స్ రష్యా చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాం’’ అని తెలిపారు. ఉక్రెయిన్ వద్ద జీవాయుధాలు ఉన్నాయన్నది రష్యా ఆరోపణ.