IPL: వేలంలో అమ్ముడుపోని ఆఫ్ఘన్ యువ ఓపెనర్ కి ఇప్పుడు ఐపీఎల్ లో బంపరాఫర్
- టీంలోకి తీసుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు
- కాంట్రాక్ట్ పేపర్లను బీసీసీఐకి పంపిన గుజరాత్
- వృద్ధిమాన్ సాహా స్థానంలో బ్యాకప్ గా అవకాశం
ఆఫ్ఘనిస్థాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ బంపరాఫర్ కొట్టేశాడు. బయో బబుల్ లో ఉండలేక ఐపీఎల్ నుంచి ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుర్బాజ్ కు గుజరాత్ టైటాన్స్ జట్టు అవకాశం కల్పించింది.
ఈ నెల 26 నుంచి ఐపీఎల్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడికి అవకాశం ఇచ్చినా.. రాయ్ కు రీప్లేస్ మెంట్ అని మాత్రం గుజరాత్ టైటాన్స్ ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా ఇష్యూ నడుస్తుండడంతో.. ముందు జాగ్రత్తగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకే రహ్మానుల్లాను జట్టులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. కీపింగ్ కు బ్యాకప్ ఆప్షన్ లాగా అతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
అతడిని తీసుకుంటున్నట్టు ఇప్పటికే కాంట్రాక్ట్ పేపర్లను బీసీసీఐకి పంపించిందని చెబుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ లో రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో అతడు వేలంలోకి వచ్చినా.. ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీంతో ఇప్పుడు అదే బేస్ ప్రైస్ తో రహ్మానుల్లాను గుజరాత్ తీసుకుంటోంది. మాథ్యూ వేడ్ రూపంలో మరో కీపర్ ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 6 వరకు వేలంలో అమ్ముడైన వాళ్లు ఐపీఎల్ లో ఆడరాదంటూ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలిచ్చింది.