Vijay Mallya: బిజీగా అమికస్ క్యూరీ.. సుప్రీంకోర్టులో విజయ్ మాల్యా కేసు విచారణ వాయిదా
- కోర్టు ధిక్కరణ కేసు విచారణ
- వేరే కేసులున్నాయన్న అమికస్ క్యూరీ
- రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా
అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) బిజీగా ఉన్నారన్న కారణంతో విజయ్ మాల్యాపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూ.9వేల కోట్ల రుణ ఎగవేతలకు సంబంధించిన కేసులో కోర్టు ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసును ఇవాళ విచారించాల్సి ఉంది.
అయితే, తనకు వేరే కేసు ఉందని, విచారణను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును సీనియర్ అడ్వొకేట్, అమికస్ క్యూరీ జైదీప్ గుప్తా విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ పి.ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది.
మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసును మార్చి 9న విచారిస్తామని ఫిబ్రవరి 10న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు పేర్కొంది. మాల్యా వ్యక్తిగతంగా గానీ లేదా ఆయన లాయర్ గానీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో అవకాశాలిచ్చామని, అయినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న మాల్యాను 2017 కేసుకు సంబంధించి ధిక్కరణకు పాల్పడినట్టు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పిన ఆదేశాలను పట్టించుకోలేదని, ఎంతో కాలం వేచి చూశామని మండిపడింది.