- శంకర్ దర్శకత్వంలో చరణ్ మూవీ
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- చరణ్ జోడీగా రెండోసారి కియారా
- ప్రచారంలో 'సర్కారోడు' టైటిల్
ఒకవైపున చరణ్ కథానాయకుడిగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మరో వైపున ఆయన కీలకమైన పాత్రను పోషించిన 'ఆచార్య' కూడా త్వరలో విడుదల కావడానికి తగిన సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా కెరియర్ పరంగా చరణ్ కి 15వ సినిమా. ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. ఇలా ఈ సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. 'వినయ విధేయ రామ' తరువాత చరణ్ జోడీగా ఆమె చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ టైటిల్ గురించిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేదే ఈ సినిమా కథ అని అంటున్నారు. తమన్ ఈ సినిమాకి బాణీలను అందిస్తున్నాడు.