YSRTP: కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన వైఎస్సార్టీపీ విజయమే: షర్మిల
- నిరుద్యోగ దీక్షల పేరిట షర్మిల పోరాటం
- ఆ పోరాటం ఫలితమే కేసీఆర్ ఉద్యోగ ప్రకటన
- ఖాళీలపైనా కేసీఆర్‌వి అబద్ధాలేనన్న షర్మిల
- ఉద్యోగాలన్నీ భర్తీ చేసే దాకా పోరాటమేనని వెల్లడి
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై వైఎఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తమ పార్టీ పోరాటాల కారణంగానే కేసీఆర్ దిగివచ్చారని ఆమె బుధవారం వ్యాఖ్యానించారు.
పార్టీ పెట్టకముందే 3 రోజుల పాటు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరాహార దీక్షలు చేశామని తెలిపిన షర్మిల... పార్టీ పెట్టాక ఏకంగా 17 వారాల పాటు నిరాహార దీక్షలు చేపట్టామని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
"పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే. ఈరోజు కేసీఆర్ గారి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన, వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజయం. ఇది వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తల విజయం. మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల పక్షాన 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు నిరాహారదీక్షలు చేశాం.
మేము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. అధికారపక్షానికి బుద్ధి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే అలవాటున్న మీరు.. ఈరోజు మళ్లీ అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాల ఖాళీలుంటే, కేవలం 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్ గారు.. మీరు ఇవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదు.
నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన మా పోరాటం ఆగిపోదు. ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు నింపేవరకు, నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం" అంటూ షర్మిల పేర్కొన్నారు.