Telangana: బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌ వ్యవహారం.. తెలంగాణ‌ అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి హైకోర్టు నోటీసులు

telangana high court issues notices to assembly secretary

  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా బ‌డ్జెట్ స‌మావేశాలు
  • వ్య‌తిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేల నిర‌స‌న‌
  • నిమిషాల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్‌
  • హైకోర్టును ఆశ్ర‌యించిన బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ల స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింద‌నే చెప్పాలి. ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ అసెంబ్లీ కార్యద‌ర్శికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ప్రారంభించ‌డాన్ని వ్య‌తిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు మొన్న సోమ‌వారం స‌మావేశాలు ప్రారంభం కాగానే నిర‌స‌న తెలిపేందుకు య‌త్నించారు. అయితే కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేల‌ను మొత్తం బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ప్ర‌కటించారు.

ఈ క్రమంలో త‌మను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సభ నుంచి సస్పెండ్ చేశారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు మంగ‌ళ‌వారం నాడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. స‌భ నియ‌మావ‌ళి, రాజ్యాంగానికి విరుద్ధంగా త‌మ‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశార‌ని వారు త‌మ పిటిష‌న్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. త‌మ సస్పెన్ష‌న్‌కు సంబంధించిన ప్రొసీడింగ్ ఉత్త‌ర్వుల‌ను ఇవ్వ‌మ‌ని కోరినా ఇవ్వ‌డం లేద‌ని కూడా వారు ఫిర్యాదు చేశారు. 

ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ జ‌ర‌గ్గా.. అసెంబ్లీ వ్య‌వ‌హారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ కోర్టును కోరారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న కోర్టు.. అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి నోటీసులు జారీ చేసి, త‌దుప‌రి విచార‌ణ‌ను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News