Andhra Pradesh: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడద్దు: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు
- విద్యా శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి
- ఇకపై విద్యా బోధనకే ఉపాధ్యాయులు
- విద్యార్థులకు పూర్తిగా అందుబాటులో ఉండాలి
- కొత్త జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలుండాలన్న సీఎం
విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను బోధనేతర కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తే.. విద్యార్థుల బోధనకు ఇబ్బందులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్షించిన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇకపై ఉపాధ్యాయులు విద్యార్థులకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని జగన్ సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శిక్షణా కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా సౌకర్యాలను మెరుగు పరచాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.