Rajasthan: అత్యాచారాలలో రాజస్థాన్ నెంబర్ 1.. రాష్ట్ర మంత్రి ధరివాల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మంత్రి
- అసహ్యకరమంటూ విరుచుకుపడిన బీజేపీ
- అత్యాచారాలను చట్టబద్ధం చేస్తారా? అని ప్రశ్న
రాజస్థాన్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందన్నారు. అంతేకాదు ఇది పురుష రాష్ట్రమంటూ వ్యాఖ్యానించారు. ఏకంగా రాష్ట్ర శాసనసభలోనే ఆయన ఇలా మాట్లాడడం గమనార్హం.
‘‘మనం రేప్ లలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఇందులో సందేహం అక్కర్లేదు. ఎందుకని అత్యాచారాల్లో ముందున్నాం? రాజస్థాన్ పురుషుల రాష్ట్రం కాబట్టి’’ అని ఆయన అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
‘‘ధరివాల్ వ్యాఖ్యలు షాకింగ్ కు గురిచేశాయి. అసహ్యకరంగా ఉన్నాయి. కానీ ఆశ్చర్యం కలిగించలేదు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ అన్నారు. అత్యాచారాన్ని ధరివాల్ చట్టబద్ధం చేసేట్టు ఉన్నారంటూ విమర్శించారు. మంత్రులు ఇలా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మహిళలు తమకు భద్రత ఉందని ఎలా అనుకోగలరని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ ప్రశ్నించారు.