Punjab: పంజాబ్ లో ఘన విజయం దిశగా ఆప్.. సీఎం అభ్యర్థి ఇంటి వద్ద అప్పుడే ప్రారంభమైన వేడుకలు.. వీడియో ఇదిగో!
- పంజాబ్ లోని 117 స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్
- 83 స్థానాల్లో లీడింగ్ లో ఉన్న ఆప్
- వెనుకంజలో సిద్ధూ, చరణ్ జిత్ సింగ్ చన్నీ
అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ మరో రాష్ట్రానికి తన అధికారాన్ని విస్తరించబోతోంది. పంజాబ్ లో ఘన విజయం సాధించే దిశగా ఆప్ దూసుకుపోతోంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో మరే పార్టీకి అందనంత ఎత్తులో 83 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ 13, బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మరో స్థానంలో ఇతరులు లీడింగ్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆప్ శిబిరంలో కోలాహలం నెలకొంది. సంగ్రూరులోని ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలు జరుపుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ వేడుక జరుపుకుంటున్నారు. ధూరి నియోజకవర్గంలో భగవంత్ మన్ లీడింగ్ లో ఉన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెనుకపడ్డారు. కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీని బాగా డ్యామేజ్ చేసింది.