up: మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ.. ఒక్కో రౌండ్ కు పెరుగుతున్న ఆధిక్యం
- 259 స్థానాల్లో బీజేపీ ముందంజ
- ఎస్పీ 129 స్థానాల్లో ఆధిక్యం
- గెలుపు దిశగా యోగి, అఖిలేశ్
యూపీలో అధికారానికి కావాల్సిన మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల సరళిని చూస్తే ఇదే తెలుస్తోంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు అవసరం. కానీ తొలి రౌండ్లలోనే బీజేపీ ఈ మార్క్ ను దాటిపోయింది. ఇప్పటి వరకు వెల్లడైన ట్రెండ్స్ ను పరిశీలిస్తే బీజేపీ 259 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తొలుత 199 స్థానాల వద్దే ఉండగా.. ఒక్కో రౌండ్ పూర్తవుతున్న కొద్దీ బీజేపీ బలం పెరుగుతూ వెళుతోంది.
బీజేపీకి గట్టి పోటీనిచ్చిన ఎస్పీ 128 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక అంకె స్థానాల్లోనే ఆధిక్యం చూపిస్తున్నాయి. కర్హాల్ స్థానంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముందంజలో ఉంటే, రాయ్ బరేలి నుంచి బీజేపీ నేత అదితి సింగ్ గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఎస్పీ నేత అజంఖాన్ రాంపూర్ లో 20వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. ఎస్పీ నేత చంద్రశేఖర్ అజాద్ కంటే ముందంజలో ఉన్నారు. బీజేపీ దిగవంగత నేత కల్యాణ్ సింగ్ మనవడు, సందీప్.. అత్రౌలి స్థానంలో గెలుపు దిశగా పయనిస్తున్నారు.