Punjab: పంజాబ్ లో 'ఆప్' స్వీప్ చేస్తున్న తరుణంలో సిద్ధూ స్పందన
- పంజాబ్ లో అఖండ విజయం దిశగా ఆప్
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న సిద్ధూ
- ఆప్ కు శుభాకాంక్షలు తెలిపిన వైనం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ఏకపక్షంగా వెలువడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో ఆ పార్టీ ఉంది. రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉండగా... వీటిలో ఏకంగా 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యతలో ఉంది. గత ఎన్నికల్లో ఆప్ సాధించిన సీట్ల కంటే ఇది 71 స్థానాలు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ 17 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. గతంలో సాధించిన సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో వెనుకబడి ఉంది. అకాళీ దళ్ 6, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీకి వెలుపల మరో రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ ప్రజల తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. ప్రజా తీర్పు దేవుడి తీర్పు వంటిదని అన్నారు. ఆప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.