Russia: పుతిన్ 'పూల‌' శుభాకాంక్షలకు మహిళల తిర‌స్కారం!

mescow women rejected flowers which came from putin

  • మ‌హిళా దినోత్స‌వం నాడు పుతిన్ ల‌క్ష పూల పంపిణీ
  • యుద్ధ స‌మ‌యంలో ఈ ఏడాది కూడా నిర్వ‌హ‌ణ‌
  • పుతిన్ పూల‌ను తిర‌స్క‌రించిన మాస్కో మ‌హిళ‌లు
  • కొంద‌రు తీసుకున్నా..చెత్త‌కుండీల్లో వేసిన వైనం
  • సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా ఈ దృశ్యాలు

ఉక్రెయిన్‌పై యుద్ధ కాంక్ష‌తో ర‌గిలిపోతున్న ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు జ‌నంలో అంత‌కంత‌కూ వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇత‌ర దేశాల మాట అటుంచితే.. స్వ‌దేశంలోనూ పుతిన్‌కు నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే పుతిన్ వైఖ‌రిని నిర‌సిస్తూ రష్యాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

తాజాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు ర‌ష్యా అధ్య‌క్షుడి హోదాలో పుతిన్ పంపిన పూల‌ను ఆ దేశ మ‌హిళ‌లు తిర‌స్క‌రించారు. అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి వ‌చ్చిన పూల‌ను కొంద‌రు తీసుకున్నా.. ఆ త‌ర్వాత వాటిని డ‌స్ట్ బిన్ల‌లో ప‌డేశారు. మ‌రికొంద‌రైతే.. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి నిర‌స‌న‌గా పుతిన్ పూల‌ను స్వీక‌రించేది లేద‌ని ముఖం మీదే చెప్పేశారట‌.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ర‌ష్యాలో ఏటా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ర‌ష్యా అధ్య‌క్షుడి హోదాలో పుతిన్ రాజ‌ధాని మాస్కోలోని మ‌హిళ‌ల‌కు ల‌క్ష పూల‌ను పంచ‌డం ఆన‌వాయతీగా వ‌స్తోంది‌. అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి జారీ అయ్యే ఆదేశాల మేర‌కు వ‌లంటీర్ల సాయంతో ఈ పూల పంపిణీ జ‌రుగుతోంది. మ‌హిళా డ్రైవ‌ర్లు, ఇత‌ర సిబ్బందికి పూల‌ను పంచాలంటూ అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి ఏటా ఆదేశాలు జారీ అవుతూనే ఉన్నాయి. 

ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది కూడా అలాంటి ఆదేశాలే జారీ కాగా.. పూల‌తో బ‌య‌లుదేరిన వలంటీర్ల‌కు చాలా చోట్ల‌ షాక్ త‌గిలింది. ఉక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న యుద్ధం కార‌ణంగా ఆయ‌న పంపిన పూలను స్వీక‌రించేది లేదంటూ మాస్కో మ‌హిళ‌లు వ‌లంటీర్ల ముఖం మీదే చెప్పేశార‌ట‌. ల‌క్ష పూల కార్య‌క్ర‌మంలో భాగంగా కొంద‌రు మ‌హిళ‌ల‌కు బొకేలు పంప‌గా..వాటికి కూడా తిర‌స్కార‌మే ఎదురైంద‌ట‌. 

అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి వ‌చ్చిన పూల‌ను తిర‌స్క‌రిస్తే ఏమ‌వుతుందోన‌న్న‌ భ‌యంతో కొంద‌రు పూల‌ను తీసుకున్నా.. వ‌లంటీర్లు వెళ్లిపోయిన మ‌రుక్ష‌ణ‌మే వాటిని చెత్త కుండీల్లో పారేశార‌ట‌. ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారిపోయాయి. ఈ ఫొటోల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాలంటూ ర‌ష్యా ప్ర‌భుత్వం ఆయా సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసిందట‌. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ర‌ష్యాకు చెందిన టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని రాసింది.

  • Loading...

More Telugu News