goa: చావు తప్పి కన్నులొట్టబోయినట్టు!.. స్వల్ప మెజారిటీతో సీఎం గెలుపు!
- శాంక్విలిమ్ నియోజకవర్గం నుంచి పోటి
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మేష్ సగ్లానీ
- ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ
- చివరకు 650 ఓట్ల మెజారిటీతో గెలిచిన సావంత్
గోవా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బీజేపీ యువ నేత ప్రమోద్ సావంత్ తన పార్టీ మాదిరే తాను కూడా గోవా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే సావంత్‌కు దక్కిన విజయాన్ని చూస్తుంటే... మన పెద్దలు చెప్పిన చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అన్న సామెతే గుర్తుకు వస్తోంది. ఎందుంకటే.. సీఎంగా కొనసాగుతున్న ఆయన తాజా ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఒకానొక దశలో కాంగ్రెస్ అభ్యర్థి కంటే వెనుకబడిపోయారన్న మాట వినిపించినా..మళ్లీ పుంజుకుని కేవలం 650 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
గోవాలోని శాంక్విలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సావంత్‌పై కాంగ్రెస్ పార్టీ ధర్మేష్ సగ్లానీని పోటీకి దింపింది. ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ హోరాహోరీగానే సాగింది. గెలుపు ఇద్దరి మధ్య దోబూచులాడిందనే చెప్పాలి. సావంత్‌కు వస్తున్న ఆధిక్యతను చూస్తున్న బీజేపీ నేతలు..అప్పటికే ఉత్తరాఖండ్‌లో ఓటమిపాలైన తమ సీఎం పుష్కర్ సింగ్ ధామికి పట్టిన గతి పడుతుందా? అని ఆందోళన చెందారు. అయితే వారికి ఊరట కలిగేలా స్వల్ప మెజారిటీతోనైనా సావంత్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. గోవా సీఎంగా మరోమారు ఆయనే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.