Pakistan: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత నిరాయుధ క్షిపణి.. వివరణ ఇవ్వాల్సిందేనన్న పాక్!
- 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందన్న పాక్
- తమ భూభాగంలో 124 కిలోమీటర్లు ప్రయాణించిందని ఆరోపణ
- తీవ్రంగా నిరసిస్తున్నామన్న పాక్
- పునరావృతం కాకూడదని హెచ్చరిక
భారత నిరాయుధ సూపర్ సోనిక్ క్షిపణి ఒకటి బుధవారం సాయంత్రం సిర్సా నుంచి దూసుకొచ్చి తమ భూభాగంలోని 124 కిలోమీటర్ల దూరంలో పడినట్టు పాకిస్థాన్ నిన్న ఆరోపించింది. 40 వేల అడుగుల ఎత్తులో దూసుకొచ్చిన ఈ క్షిపణి భారత్, పాకిస్థాన్ గగనతలంలోని ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేసిందని అలాగే, పౌరులు, నేలమీది ఆస్తులను కూడా ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. అయితే, పాక్ ఆరోపణలపై ఇటు భారత వాయుసేన నుంచి కానీ, రక్షణ మంత్రిత్వశాఖ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు.
పాకిస్థాన్ సాయుధ దళాల ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్చి 9న సాయంత్రం 6.43 గంటల సమయంలో హై స్పీడ్ ఆబ్జెక్ట్ ఒకటి భారత భూభాగంలో పైకెగిరి అకస్మాత్తుగా పాక్ గగనతలాన్ని ఉల్లంఘించి చివరికి మియా చన్ను ప్రాంతంలో ల్యాండైందన్నారు.
అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అది ల్యాండైన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేవని, అయితే ఓ గోడ మాత్రం కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనను తాము తీవ్రంగా నిరసిస్తున్నామని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ ఘోరమైన ఉల్లంఘనను పాక్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
భారత్ నుంచి దూసుకొచ్చిన వస్తువు పాక్ భూభాగంలో మొత్తం 124 కిలోమీటర్లు ప్రయాణించిందని పాకిస్థాన్ వైమానిక దళం ప్రతినిధి తారిక్ జియా పేర్కొన్నారు. దీని మొత్తం ప్రయాణ సమయం 6.46 నిమిషాలని తెలిపారు. పాక్ భూభాగంలో అది 3.44 నిమిషాల పాటు ప్రయాణించిందని వివరించారు. శిథిలాలను వెలికి తీసినప్పుడు దీనిని సూపర్ సోనిక్ నిరాయుధ క్షిపణిగా గుర్తించినట్టు చెప్పారు.