BSP: ముస్లింలు మావైపు ఉంటే ‘ఏనుగే’ గెలిచేది.. మళ్లీ తిరిగొస్తాం: మాయావతి
- వారంతా ఎస్పీవైపు వెళ్లారని వ్యాఖ్య
- ఓటమితో అధైర్య పడొద్దు
- ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లాలి
- బీజేపీకి బీఎస్పీ బీ టీమ్ అన్నది తప్పుడు ప్రచారమన్న మాయావతి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బయటకు వచ్చారు. నిరుత్సాహ పడొద్దంటూ, భవిష్యత్తులో తప్పకుండా అధికారాన్ని సాధిస్తామంటూ పార్టీ కేడర్ కు ధైర్యం చెప్పి, ఉత్సాహాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఫలితాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘యూపీ ఎన్నికలు బీఎస్పీ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. వీటితో నిరుత్సాహానికి లోను కాకూడదు. బదులుగా దీన్నుంచి మనం నేర్చుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుని, పార్టీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. తిరిగి అధికారంలోకి రావాలి. యూపీ ఎన్నికలు బీఎస్పీకి ముఖ్యమైన పాఠం’’ అని మాయావతి పేర్కొన్నారు.
గతంలో బీజేపీ మాదిరే ఇప్పుడు బీఎస్పీ సైతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘‘2017కు ముందు బీజేపీ బలంగా లేదు. నేడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఫలితాలు అన్నవి మాకు ఒక పాఠం లాంటివి. మా ప్రయత్నాలను కొనసాగిస్తాం’’ అని చెప్పారు.
ముస్లింల ఓట్లు దళితుల పక్షాన (బీఎస్పీ) ఉంటే ఫలితాలు అద్భుతంగా వచ్చేవని మాయావతి అన్నారు. కానీ, మనువాద మీడియా కేవలం ఎస్పీ మాత్రమే బీజేపీని నిలువరించగలదంటూ ప్రచారం చేసినట్టు విమర్శించారు. దాంతో ముస్లింలు ఎస్పీవైపు మళ్లినట్టు చెప్పారు. గతంలో ఎస్పీని నమ్మడం తాము చేసిన పెద్ద తప్పిదంగా అంగీకరించారు. గతంలో ఎస్పీతో కలసి బీఎస్పీ పనిచేయడం గమనార్హం. బీజేపీకి బీఎస్పీ బీ టీమ్ అంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. వాస్తవం వేరు అని ఆమె చెప్పారు.