Andhra Pradesh: బడ్జెట్ సందర్భంగా బుగ్గన చెప్పిన కైలాష్ సత్యార్థి కథ!

Buggana Tells A Tale Of Kailash Satyarthi
  • బాలల సంక్షేమ పద్దును వివరిస్తూ కథానిక
  • కైలాష్ సత్యార్థికి చిన్నప్పుడు ఎదురైన అనుభవం వివరణ
  • ఆయన స్ఫూర్తిగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్న ఆర్థిక మంత్రి
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బాలల సంక్షేమ పద్దును వివరిస్తూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గురించి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, భద్రతా హక్కు, గౌరవ హక్కు, సమానత్వం, శాంతి హక్కుల కోసం కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 

‘‘కైలాష్ సత్యార్థి వాస్తవానికి సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలో ఆయనకు ఎదురైన ఓ సంఘటనే బాలల హక్కుల కోసం ఆయన పోరాడేలా చేసింది. ఓ రోజు ఆయన స్కూలుకు వెళుతూ బడి బయట ఓ చెప్పులు కుట్టే కుర్రాడిని చూశారు. తానెందుకు బడికి పోగలుగుతున్నాను.. ఆ కుర్రాడెందుకు చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాడని ఆనాడు కైలాష్ సత్యార్థి ఆలోచించారు. 

దానిపై చాలా రోజుల మదన పడ్డారు. ఓ రోజు వర్షం పడుతుంటే.. చెప్పులు నానుతున్నాయంటూ ఆ చెప్పులు కుట్టే పిల్లాడిపై అతడి తండ్రి అరిచాడట. అది చూసి ఓ వైపు మనిషి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటుంటే.. ఇక్కడ చెప్పులు తడవకూడదంటూ తండ్రి అరిచాడెందుకని కైలాష్ సత్యార్థి ఆవేదన చెందారు. ఆ పిల్లాడు బడికి ఎందుకు వెళ్లకూడదని అనుకున్నారు. అలాంటి పిల్లలకోసం ‘బచ్ పన్ బచావో’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా దాదాపు 83 వేల మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు’’ అని కైలాష్ సత్యార్థి గురించి ఆయన చెప్పుకొచ్చారు. 

ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా కైలాష్ సత్యార్థిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
Andhra Pradesh
Buggana Rajendranath
Budget
YSRCP
YS Jagan
Kailash Satyarthi

More Telugu News