Navjot Singh Sidhu: పంజాబ్ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు: సిద్ధూ
- ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు
- పంజాబ్ లో ఆప్ ప్రభంజనం
- అధికార కాంగ్రెస్ కు ఘోర పరాభవం
- ప్రజా వాక్కు దైవ వాక్కు అన్న సిద్ధూ
ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ముగియగా, ఒక్క పంజాబ్ లో మాత్రం సంచలన ఫలితాలు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తమ చీపురు గుర్తుకు తగ్గట్టుగానే ఊడ్చిపారేసింది. ఆప్ ప్రభంజనంతో అధికార కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు.
పంజాబ్ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రజలు రాజకీయ పరమైన మార్పును కోరుకున్నారని, కొత్త పార్టీకి స్వాగతం పలికారని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరని సిద్ధూ స్పష్టం చేశారు. ప్రజా వాక్కు దైవ వాక్కుతో సమానం అని ఉద్ఘాటించారు. ప్రజల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నామని, శిరసావహిస్తామని తెలిపారు.
ఈ ఫలితాలతో తానేమీ కుంగిపోవడం లేదని, పంజాబ్ అభ్యున్నతే తన లక్ష్యమని, అందులో ఎలాంటి మార్పులేదని సిద్ధూ స్పష్టం చేశారు. ఓ సన్యాసిలా రాగబంధాలకు అతీతంగా, ఎలాంటి భయాలు లేకుండా పాటుపడతానని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పంజాబ్ పై తన ప్రేమ కొనసాగుతుందని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధూ 6 వేల ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. గతంలో అమృత్ సర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిద్ధూ మూడుసార్లు గెలిచారు. 2017లో కాంగ్రెస్ తరఫున పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.