TDP: ప్రాణాలు పోతున్నా స్పందించరా?.. జగన్ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
- జంగారెడ్డిగూడెంలో 15 మంది మృత్యువాత పడ్డారన్న బాబు
- ఈ మరణాలన్నీ కేవలం 3 రోజుల్లోనే సంభవించాయని వ్యాఖ్య
- కుళ్లిన కోడిగుడ్ల కారణంగా నంద్యాలలో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారంటూ విమర్శ
- రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ చంద్రబాబు ఫైర్
ఏపీలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నా స్పందించరా? అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 15 మంది మృతి, కర్నూలు జిల్లా నంద్యాలలో కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు.. జనం ప్రాణాలు కోల్పోతున్నా వైసీపీ సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో నాటు సారా కారణంగా ఇటీవలే 15 మంది చనిపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ మరణాలన్నీ కేవలం 3 రోజుల్లోనే సంభవించాయని ఆయన తెలిపారు. నాటు సారా కారణంగా వాంతులు, విరేచనాలతో జంగారెడ్డిగూడెం వాసులు ఆసుపత్రుల్లో చేరి గంటల వ్యవధిలోనే చనిపోయారని ఆయన తెలిపారు.
ఇక నంద్యాలలో కలుషితాహారం తిన్న కారణంగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. నంద్యాలలోని విశ్వనగర్ పాఠశాలలో కుళ్లిన కోడి గుడ్లు పెట్టిన కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించిన చంద్రబాబు..అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.