UGC: యూనివర్సిటీల్లో బోధనకు పీహెచ్ డీ లేకపోయినా ఫర్వాలేదు.. యూజీసీ అసాధారణ నిర్ణయం
- పలు రంగాలకు చెందిన నిపుణులకు బోధన అవకాశాలు
- ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో ప్రత్యేక పోస్టులు
- నిబంధనల సవరణకు కమిటీ ఏర్పాటు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. పీహెచ్ డీ చదవకపోయినా ఇకపై యూనివర్సిటీల్లో బోధనకు అనుమతించనుంది. వీరి కోసం ప్రత్యేకంగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో పోస్టులు ఏర్పాటు చేస్తోంది.
‘‘పలు రంగాలకు చెందిన ఎంతో మంది నిపుణులు బోధనా రంగంలోకి రావాలనుకుంటారు. ఎవరో ఒకరు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు అమలు చేసి ఉంటారు. క్షేత్ర స్థాయి అనుభవం ఎంతో ఉంటుంది. లేదా గొప్ప డ్యాన్సర్ లేదా సంగీత కారుడు అయి ఉండొచ్చు. ప్రస్తుత నిబంధనల కింద వారిని బోధకులుగా నియమించడానికి లేదు’’ అని యూజీసీ చైర్ పర్సన్ ఎం. జగదీష్ కుమార్ తెలిపారు.
కనుక ఇటువంటి వారు పాఠాలను బోధించేందుకు వీలుగా ప్రత్యేక పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘‘దీంతో బోధించడానికి పీహెచ్ డీ అవసరం లేదు. ఆయా విభాగాలలో నిపుణులు తమ అనుభవాలను ప్రదర్శిస్తే చాలు. నిపుణులు, విద్యాసంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ ఉద్యోగాలు తాత్కాలిక లేదా శాశ్వత ప్రాతిపదికన ఉండొచ్చు’’ అని జగదీష్ కుమార్ వివరించారు. బోధకుల నియామకాలకు సంబంధించి నిబంధనల సవరణ కోసం కమిటీని నియమించాలని యూజీసీ చైర్మన్, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ల భేటీలో నిర్ణయించారు.