AAP: యూపీలో ఒక్క సీటు గెలవకపోయినా.. విజయోత్సవ ర్యాలీలకు సిద్ధమవుతున్న ఆప్!
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్
- జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే దిశగా అడుగులు
- యూపీలో గ్రామ స్థాయి నుంచి క్యాడర్ ను పెంచుకునేందుకు ప్రణాళికలు
ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయ చరిత్ర సంపూర్ణంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయదుందుభి మోగించింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ ఏకంగా 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. భగవంత్ మాన్ ఈ నెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. అంతేకాదు కేజ్రీవాల్, భగవంత్ మాన్ రేపు అమృత్ సర్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఆప్ విజయోత్సవ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయానికి సంబంధించి యూపీలో ర్యాలీలు చేపట్టబోతోంది. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు.
పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయం.. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతోందనే ప్రజల భావనను తెలియజేస్తోందని సింగ్ చెప్పారు. తమ పార్టీ గుర్తు అయిన చీపురుతో దేశంలోని రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి ఆప్ కు బలమైన క్యాడర్ ను తయారు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండేలా పోరాడుతామని... ఈ పోరాటం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
మార్చి 23, 24 తేదీల్లో లక్నోలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పర్ఫామెన్స్ పై ఈ సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవస్థను విస్తరించే అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యే జరిగాయని... అందువల్లే ఇతర పార్టీలకు ఓట్లు పడలేదని చెప్పారు.