Uttar Pradesh: యూపీలో బీజేపీ గెలిచినా.. డిప్యూటీ సీఎం సహా మట్టికరిచిన 11 మంది మంత్రులు
- యోగి తర్వాత అంతటి చరిష్మా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యకూ దారుణ పరాభవం
- ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో ఓటమి
- బీజేపీ మిత్ర పక్షం అప్నాదళ్ చీఫ్ కు ఆమె స్వయాన సోదరి
- కొందరికి కలసిరాని స్థానాలు
- సీట్లు మార్చడంతో ఓటములు
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ గెలిచి ఉండొచ్చుగాక. కానీ, ఆ పార్టీకి ఈసారి సీట్లు భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి స్థానాలు పెరిగాయి. ఎన్నికల్లో మంత్రులు మట్టికరిచారు. సీఎం యోగి కేబినెట్ సహచరులు 11 మంది ఓడిపోయారు.
యోగికి తలలో నాలుకలా ఉండేవ్యక్తి, యోగి తర్వాత అంతటి చరిష్మా ఉన్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఓటమిపాలయ్యారు. సిరాతు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో దారుణ పరాజయాన్ని చూశారు. పల్లవి పటేల్.. బీజేపీ మిత్రపక్షం అయిన అప్నాదళ్ (ఎస్) పార్టీ అధినేత్రి అనుప్రియా పటేల్ కు స్వయాన సోదరి కావడం విశేషం.
నాన్ యాదవ్ ఓబీసీ కార్డును ఆయన సరిగ్గా వాడుకోలేకపోయారని, అందుకే ఓటమి పాలయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పల్లవి పటేల్.. తన కుర్మి సామాజికవర్గం వారి ఓట్లను బాగా పొందిందని అంటున్నారు. కౌశంబిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించినా.. మౌర్యను ప్రజలు ఓడించారు.
మరో మంత్రి సురేశ్ రానా కూడా భవన్ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి అష్రాఫ్ అలీ ఖాన్ చేతిలో ఓడిపోయారు. పాటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సింగ్ చేతిలో 22 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఈట్వా సీటులో పోటీ చేసిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీశ్ చంద్ర ద్వివేది.. ఎస్పీ అభ్యర్థి మాతా ప్రసాద్ పాండే చేతిలో 1600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడారు. క్రీడా శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ.. ఫేఫ్నా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగ్రామ్ సింగ్.. ఆయన్ను మట్టికరిపించారు.
పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. బైరియా స్థానంలో ఎస్పీ అభ్యర్థి జై ప్రకాశ్ చేతిలో ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేంద్ర సింగ్ చేతిలో జై ప్రకాశ్ ఓడారు. ఇప్పుడు సురేంద్ర సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. జై ప్రకాశ్ గెలిచారన్న వాదనలున్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల్లో బాలియా సదర్ నుంచి పోటీ చేసిన ఆనంద్ స్వరూప్.. బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ కోసం ఆ స్థానాన్ని వదులుకుని బైరియాకు షిఫ్ట్ అయ్యారు. ఆ స్థానంలో బీజేపీ ఓడిపోవడానికి అదికూడా కారణమైందన్న విశ్లేషణ ఉంది. బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో వికషీల్ ఇన్సాన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన సురేంద్ర సింగ్.. ఓట్లు చీల్చేశారు. ఆయనకు దాదాపు 16 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఆహారం, పౌర సరఫరాల సహాయ మంత్రి రణ్వేంద్ర సింగ్ (ధున్నీ సింగ్).. హుసేన్ గంజ్ స్థానంలో ఉషా మౌర్య చేతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఉష.. ఇప్పుడు ఎస్పీ టికెట్ పై నిలబడి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.
మంత్రులు చంద్రికా ప్రసాద్ తివారీ (చిత్రకూట్ నియోజకవర్గం), ఛాత్రపాల్ సింగ్ గంగ్వార్ (బహేరి), సంగీతా బల్వంత్ (ఘాజీపూర్ సదర్)లు.. ఎస్పీ అభ్యర్థులు అనిల్ కుమార్, అతాయుర్ రెహ్మాన్, జై కిషన్ సాహుల చేతిలో ఓడిపోయారు. ఆ ముగ్గురికి గత ఏడాది సెప్టెంబర్ లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా యోగి చోటిచ్చారు.
వ్యవసాయ శాఖ సహాయ మంత్రి లఖాన్ సింగ్ రాజ్ పుత్.. దిబియాపూర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ప్రదీప్ యాదవ్ పై ఓడిపోయారు. కేవలం 500 స్వల్ప ఓట్ల తేడాతోనే ఆయన పరాజయం పొందారు.