UTF: నెలాఖరు వరకే గడువు... జగన్ సర్కారుకు యూటీఎఫ్ డెడ్ లైన్
- అనంతపురంలో యూటీఎఫ్ మహా సభలు
- సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలుకు డిమాండ్
- పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల ప్రస్తావన
పీఆర్సీపై జగన్ సర్కారు అవలంబించిన తీరుకు ఉద్యోగ సంఘాలన్నీ దాదాపుగా ఒప్పేసుకున్నా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్‌లు జగన్ సర్కారుపై పోరు సాగిస్తూనే ఉన్నాయి.
ఇందులో భాగంగా పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దులకు సంబంధించి జగన్ సర్కారుకు యూటీఎఫ్ ఓ డెడ్ లైన్ విధించింది. ఈ నెలాఖరులోగా ఈ రెండు అంశాలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం రాని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని యూటీఎప్ ప్రకటించింది.
ఈ మేరకు అనంతపురం వేదికగా జరుగుతున్న యూటీఎఫ్ మహాసభల్లో భాగంగా ఆ సంఘం నేతలు జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. సీపీఎస్ రద్దు చేస్తామంటూ జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా.. జగన్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు కొత్త పీఆర్సీ మేరకు వేతనాలను పెంచాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.