DL Ravindra Reddy: వివేకా హత్య వెనుక ఇద్దరు పెద్దల హస్తం ఉందన్న ప్రచారంపై సీబీఐ నిగ్గు తేల్చాలి: మాజీమంత్రి డీఎల్
- హత్యకేసును సునీత కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న డీఎల్
- నిందితులెవరూ తప్పించుకోలేరని కామెంట్
- సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతోందని కితాబు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిష్పాక్షింగా దర్యాప్తు జరుపుతోందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన ఇవాళ కడప జిల్లా ఖాజీపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకా హత్య వ్యవహారంలో ఇద్దరు పెద్దల హస్తం ఉందన్న ప్రచారంపై సీబీఐ నిగ్గుతేల్చాలని కోరారు.
పులివెందులలో వైసీపీ నేతల ప్రమేయంపై ప్రచారం జరుగుతోందని అన్నారు. వైసీపీ నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సజ్జల విశ్వప్రయత్నం చేస్తున్నారని డీఎల్ ఆరోపించారు. అంతేకాదు, వివేకా హత్యకేసును సునీత కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ కేసులో సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని అనుకుంటున్నానని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. బాబాయి హత్యకు గురైతే జగన్ సాయంత్రానికి చేరుకోవడాన్ని ఏమనాలి? అని డీఎల్ ప్రశ్నించారు. నిందితులను కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.