Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తతలు రగిల్చిన భూమా నాగిరెడ్డి దంపతుల విగ్రహావిష్కరణ
- నేడు భూమా నాగిరెడ్డి వర్ధంతి
- ఆళ్లగడ్డలో విగ్రహాలు ఏర్పాటు చేసిన భూమా కిశోర్ రెడ్డి
- ఏవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం
- అఖిలప్రియను ఆహ్వానించని వైనం
- విగ్రహాలను ఆవిష్కరించి కలకలం రేపిన అఖిలప్రియ
ఇవాళ (మార్చి 12) మాజీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి వర్ధంతి. భూమా నాగిరెడ్డి, ఆయన అర్ధాంగి శోభా నాగిరెడ్డి ఇరువురూ ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. అయితే, భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. కిశోర్ రెడ్డి సొంత ఖర్చుతో ఆ విగ్రహాలు తయారుచేయించారు. నేడు భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు చేశారు.
భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. భారీ సంఖ్యంలో భూమా కుటుంబ అభిమానుల నడుమ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. కానీ, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను ఆహ్వానించలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన అఖిలప్రియ తన భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలతో కలిసి వెళ్లి తానే స్వయంగా ఆ విగ్రహాలను ఆవిష్కరించారు. దాంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, ఆళ్లగడ్డలో భూమా కుటుంబీకుల మధ్య విభేదాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన భూమా కిశోర్ రెడ్డి, ఇతర కుటుంబీకులు బీజేపీలో ఉండగా.... అఖిలప్రియ మాత్రం టీడీపీలో ఉన్నారు. భూమా బంధువర్గాన్ని అఖిలప్రియకు వ్యతిరేకంగా కిశోర్ రెడ్డి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కిశోర్ రెడ్డి పొలం కాంపౌండ్ వాల్ ను అఖిలప్రియ అనుచరులు ధ్వంసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇరువురి మధ్య విభేదాలు మరింత భగ్గుమన్నాయి. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ లపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
ఇప్పుడీ విగ్రహావిష్కరణ వ్యవహారంతో మరోసారి స్పర్ధలు రచ్చకెక్కాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా కుటుంబీకుల రాజకీయ ప్రాబల్యం గురించి తెలిసిందే. ప్రస్తుతం అఖిలప్రియ ఒక్కరే టీడీపీలో ఉండగా, కిశోర్ రెడ్డి సహా అనేకులు బీజేపీలో ఉన్నారు. మరికొందరు వైసీపీలో ఉన్నారు. భూమా కిశోర్ రెడ్డి ఆళ్లగడ్డ బీజేపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
కాగా, భూమా అఖిలప్రియ చర్యలపై కిశోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. నారాయణరెడ్డితో విగ్రహావిష్కరణ చేయించాలని తాము భావించామని వెల్లడించారు. మా బాబాయిని నారాయణరెడ్డి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని, ఆయనతోనే తాము విగ్రహావిష్కరణ చేయిస్తామని భూమా కిశోర్ రెడ్డి వెల్లడించారు. అఖిలప్రియ విగ్రహావిష్కరణ చేసిన నేపథ్యంలో, విగ్రహాల వద్ద పసుపునీళ్లు చల్లి ప్రక్షాళన చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులపై ప్రేమ ఉంటే అఖిలప్రియ అలా చేసి ఉండేది కాదని, ఆళ్లగడ్డలో భయాందోళనలు సృష్టించేందుకే ఆమె దౌర్జన్యంగా విగ్రహావిష్కరణ చేసిందని ఆరోపించారు.