Telangana: తెలంగాణ డ్వాక్రా మహిళలకు శుభవార్త... అభయహస్తం నిధులు తిరిగిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం
- గతంలో అభయహస్తం పథకానికి డబ్బు చెల్లించిన మహిళలు
- ఆసరా పథకం ద్వారా పెన్షన్లు ఇస్తున్న సర్కారు
- అభయహస్తం నిధులు తిరిగివ్వాలని కోరిన మహిళలు
- సానుకూలంగా స్పందించిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తియ్యని కబురు చెప్పింది. అభయహస్తం నిధులను తిరిగి డ్వాక్రా మహిళలకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 21 లక్షల మంది డ్వాక్రా మహిళలు రూ.545 కోట్ల మేర కాంట్రిబ్యూటరీ పెన్షన్ నిమిత్తం పొదుపు చేశారు. అందుకోసం ఒక్కొక్కరూ రూ.500 చెల్లించారు. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆసరా పథకం కింద పెన్షన్ రూపంలో ఒక్కొక్క డ్వాక్రా మహిళకు నెలకు రూ.2016 చెల్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, గతంలో తాము అభయహస్తం పథకం కోసం చెల్లించిన నిధులను తిరిగి ఇవ్వాలని డ్వాక్రా మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పేదరిక నిర్మూలన సంస్థ వద్ద ఉన్న ఆ నిధులను మరికొన్నిరోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వివరాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు, ఎర్రబెల్లి, మల్లారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో అధికారులతో సమావేశమై అభయహస్తం నిధుల తిరిగి చెల్లింపు విధివిధానాలపై చర్చించారు.