Congress: ఉలిక్కిపడ్డ కాంగ్రెస్!.. రాజీనామాలు లేవని ప్రకటన!
- సోనియా, రాహుల్,ప్రియాంకలు రాజీనామా చేస్తారంటూ వార్త
- వేగంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ
- ఊహాజనితమని, అవాస్తవమని ఖండన
జాతీయ మీడియాలో శనివారం సాయంత్రం వైరల్గా మారిన వార్తను చూసినంతనే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆ వార్త కేవలం ఊహాగానమేనంటూ కొట్టిపారేసింది. ఆ వార్త ఊహాజనితమే కాకుండా సత్య దూరమైనదని వివరణ ఇచ్చింది. పార్టీ వర్గాలు అంటూ ఆ వార్తను రాశారంటూ జాతీయ మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైరల్ అయిన ఆ వార్త ఏమిటో, ఆ వార్తను కాంగ్రెస్ ఎలా ఖండించిందో ఓ సారి పరిశీలిస్తే.. ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి దక్కిన ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారని ఈ సాయంత్రం ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ వార్త గురించి తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెనువెంటనే స్పందించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ వార్తను కొట్టేస్తూ మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాలు అంటూ జాతీయ మీడియా అసత్య వార్తను ప్రచురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.