Kamala Harris: ఉక్రెయిన్ శరణార్థుల కోసం ఏం చేస్తారన్న ప్రశ్నకు పెద్దగా నవ్విన కమలా హారిస్.. నవ్వులాటగా ఉందా? అంటూ నెటిజన్ల ఫైర్
- పోలండ్ రాజధాని వార్సాలో విలేకరుల సమావేశం
- ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటూ పెద్దగా నవ్వేసిన కమల
- అతి పెద్ద మానవతా సంక్షోభంపై నవ్వులా? అంటూ నెటిజన్లు మండిపాటు
ఉక్రెయిన్ శరణార్థుల విషయంలో అమెరికా ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందా? అన్న ప్రశ్నకు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెద్దగా నవ్వడంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం కారణంగా లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని దేశం దాటుతుంటే మీకు నవ్వులాటగా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నాటోలో భాగమైన తూర్పు ఐరోపా మిత్ర దేశాలకు మద్దతుగా కమలా హారిస్ పోలండ్ రాజధాని వార్సా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా సమావేశంలో కమలతోపాటు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా పాల్గొన్నారు.
ఉక్రెయిన్ శరణార్థుల కోసం అమెరికా ప్రత్యేకంగా ఏవైనా చర్యలు తీసుకుంటోందా? అని ఈ సందర్భంగా విలేకరులు కమలను ప్రశ్నించారు. అలాగే, శరణార్థులకు సహకరించమని మీరు అమెరికాను అడగాలనుకుంటున్నారా? అని పోలండ్ అధ్యక్షుడిని అడిగారు. ఈ ప్రశ్నకు పోలండ్ అధ్యక్షుడు స్పందిస్తారేమోనని కమల ఆయన వైపు చూశారు. ఆయన సమాధానం చెప్పకపోయే సరికి.. అవసరంలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడని వ్యాఖ్యానిస్తూ కొన్ని క్షణాలపాటు కమల గట్టిగా నవ్వేశారు.
అనంతరం పోలండ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉక్రెయిన్ శరణార్థుల కోసం కాన్సులర్ ప్రక్రియను వేగవంతం చేయమని హారిస్‌ను కోరినట్టు చెప్పారు. అయితే, శరణార్థులను అమెరికా స్వీకరిస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఈ సమావేశంలో కమలా హరిస్ గట్టిగా నవ్విన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
అది చూసిన నెటిజన్లు కమలపై మండిపడ్డారు. గత 80 ఏళ్లలో ఎన్నడూ చూడని మనవతా సంక్షోభం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా నవ్వడం దేనికి సంకేతమని విరుచుకుపడుతున్నారు. సర్వం కోల్పోయి, నిస్సహాయ స్థితిలో శరణార్థులుగా తరలిపోతున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, వారిని ఆదుకుంటారా? అని ప్రశ్నిస్తే ఈ నవ్వులేంటని మండిపడుతున్నారు.