USA: అగ్ని ప్రమాదం నుంచి కాపాడేందుకు కుమారుడిని కిందికి విసిరేసిన తండ్రి.. చేతులతో పట్టుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో!
- అమెరికాలోని సౌత్ బ్రన్స్‌విక్‌లో ఘటన
- సౌత్ రిడ్జ్‌వుడ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
- పోలీసుల సహకారంతో తండ్రి కూడా కిందికి దూకిన వైనం
అగ్నిప్రమాదం నుంచి కాపాడేందుకు తన మూడేళ్ల కుమారుడిని రెండో అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేశాడో తండ్రి. కిందనున్న పోలీసులు తమ చేతులతో ఆ చిన్నారిని పట్టుకుని ప్రాణాలు కాపాడారు. అమెరికాలోని సౌత్ బ్రన్స్‌విక్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సౌత్ రిడ్జ్ వుడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని రెండు, మూడు అంతస్తుల్లో గతవారం అగ్ని ప్రమాదం సంభవించింది.
అందులో చిక్కుకున్న ఓ కుటుంబం బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తమ మూడేళ్ల చిన్నారిని కాపాడుకునేందుకు తండ్రి పడుతున్న తాపత్రయాన్ని గమనించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు.. ఆ చిన్నారిని కిందికి విసిరేయాలని సూచించారు. తొలుత తటపటాయించిన అతడు ఆ తర్వాత మరో దారిలేక రెండో అంతస్తు కిటికీ నుంచి కుమారుడిని కిందికి విసిరేశాడు. కిందనున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు తమ చేతులతో ఆ చిన్నారిని పట్టుకున్నారు. సిబ్బంది బాడీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
కుమారుడిని విసిరేసిన తండ్రి కూడా ఆ తర్వాత పోలీసుల సాయంతో కిందికి దూకి తుప్పల్లో పడ్డాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, ఒకరిని ఆసుపత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి చిన్నారిని, అతడి తండ్రిని కాపాడిన మా హీరోలకు ధన్యవాదాలు అని పోలీసు అధికారులు ట్వీట్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అద్భుతమైన టీమ్ వర్క్ ఇదని కొనియాడారు.