Auto fares: హైదరాబాద్ లో ఆటో చార్జీల మంట.. భారీ పెంపునకు రంగం సిద్ధం!
- బేస్ ఫేర్ రూ.20 నుంచి రూ.40కు
- 1.6 కిలోమీటర్ వరకు ఈ చార్జీ
- ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.25
- ప్రస్తుతం ప్రతి కిలోమీటర్ కు రూ.11
- రవాణా శాఖ ముందుకు ప్రతిపాదనలు
ఒకవైపు అన్ని రకాల నిత్యావసరాల ధరల మంటలతో అవస్థలు పడుతున్న సామాన్యులకు హైదరాబాద్ లో ఆటో చార్జీల పెంపు కూడా తోడు కానుంది. గడిచిన ఎనిమిదేళ్లుగా ధరల సవరణ లేకపోవడంతో.. రెట్టింపునకు పైగా చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రవాణా శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆమోదిస్తే చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం ఆటో బేస్ చార్జీ రూ.20గా ఉంటే, దాన్ని రూ.40 చేయనున్నారు. 1.6 కిలోమీటర్ కు బేస్ ఫేర్ అమలవుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటర్ కు రూ.11 చార్జీ ప్రస్తుతం ఉంటే, దాన్ని రూ.25కు పెంచనున్నారు. ఆటో డ్రైవర్ల సంఘాలతో పలు విడత చర్చల అనంతరం చార్జీల పెంపు ప్రతిపాదనలను రవాణా శాఖ ఆమోదానికి పంపించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
చివరిగా 2014లో ధరలను సవరించారు. నాడు స్వల్పంగా పెంపు నిర్ణయం తీసుకున్నారు. కానీ, పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ స్థాయి పెంపును ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే మీటర్లు వేసి తీసుకెళ్లే ఆటో డ్రైవర్లే కనిపించడం లేదు. ఎప్పటి నుంచో చార్జీలను పెంచే నడుపుతున్నారు. కాకపోతే మీటర్ రూపంలోనూ ధరల పెంపునకు ఆమోదం లభిస్తుందంతే.