Sachin Tendulkar: శ్రీశాంత్ నిష్క్రమణపై స్పందించిన సచిన్ టెండూల్కర్
- ఎప్పుడూ ప్రతిభ ఉన్న బౌలర్ గానే చూశా
- నీలో ఎన్నో నైపుణ్యాలున్నాయ్
- సెకండ్ ఇన్నింగ్స్ కు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట్
టీమిండియా పేసర్ శ్రీశాంత్.. అతడి కెరీర్ సాఫీగా ఏమీ సాగలేదు. అన్నీ ఆటుపోట్లే. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, నిలకడలేని మనస్తత్వం, హర్భజన్ తో గొడవ.. ఇలా ఎన్నెన్నో వివాదాలు అతడి చుట్టూ మూగాయి. 2013 నుంచి అతడిపై జీవిత కాల నిషేధం పడింది. అప్పట్నుంచి అతడు జట్టులోకి రావడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలోనే తాను రిటైర్ అవుతున్నట్టు శ్రీశాంత్ ప్రకటించాడు.
అతడి రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ నిన్న రాత్రి స్పందించాడు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ‘‘నిన్నెప్పుడూ ప్రతిభ కలిగిన బౌలర్ గానే నేను చూశాను. నీలో చాలా నైపుణ్యాలున్నాయి. ఎన్నో ఏళ్లు టీమిండియా క్రికెట్ కు నువ్వు సేవలందించినందుకు శుభాకాంక్షలు. నీ రెండో ఇన్నింగ్స్ కు ఆల్ ద బెస్ట్ ’’ అంటూ కామెంట్ చేశాడు.
కాగా, టీమిండియా తరఫున శ్రీశాంత్ 2005 నుంచి 2011 వరకు సేవలందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ పై 2013 నుంచి జీవిత కాల నిషేధం ఎదుర్కొన్న అతడికి.. 2019 ఆగస్టులో ఉపశమనం లభించింది. జీవిత కాల నిషేధాన్ని కోర్టు ఏడేళ్లకు తగ్గించింది. దీంతో 2020 నుంచి కేరళ తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. ఏ జట్టూ అతడిపై ఆసక్తి చూపలేదు.