Paytm: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్.. బెయిల్ పై విడుదల

Paytm Vijay Shekhar Sharma arrested and released on bail
  • ఢిల్లీ డీసీపీ కారును ఢీకొట్టిన శర్మ కారు
  • డీసీపీ కారుకు నష్టం
  • కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా కేసు దాఖలు
పేటీఎం వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అరెస్ట్ చేసిన రోజే బెయిల్ పై ఆయన్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని అరబిందో మార్గ్ లో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద శర్మ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు .. డీసీపీ (సౌత్ ఢిల్లీ) బెనితా మేరీ జైకర్ కారును ఢీకొట్టినట్టు పోలీసుల అభియోగం. ఆ సమయంలో కారులో డీసీపీ లేరు. 

నాడు డీసీపీ కారును నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ స్పందిస్తూ.. ‘‘నాడు మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ కారు వేగంగా వచ్చి డ్యాష్ ఇచ్చి వెళ్లింది. దాంతో మా కారు డ్యామేజ్ అయింది. అదే విషయాన్ని డీసీపీ జైకర్ కు చెప్పాం. ఆమె సూచనల మేరకు కారు నెంబర్ ఆధారంగా మాలవీయ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశాము’’అని చెప్పారు.

నెంబర్ ఆధారంగా ఢీకొట్టిన కారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. బెయిల్ పై వెంటనే విడుదల చేశారు.
Paytm
Vijay Shekhar Sharma
arrested
bail
accident
delhi

More Telugu News