dengue: డెంగీకి హైదరాబాద్ సైంటిస్టుల కొత్త మందు.. త్వరలో మానవులపై ప్రయోగాలు
- జంతువులపై పరీక్షలు పూర్తి
- అనుమతులు వస్తే ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులపై పరీక్షలు
- పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్న పరిశోధన బృందం
డెంగీకి మెరుగైన చికిత్స దిశగా హైదరాబాద్ గీతం వర్సిటీ శాస్త్రవేత్తలు మంచి పురోగతి సాధిస్తున్నారు. జంతువులపై విజయవంతంగా ప్రయోగాలను పూర్తి చేసిన పరిశోధకులు.. త్వరలో మానవులపై ప్రయోగించి చూడనున్నారు. ఇందుకోసం క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఇండియా వద్ద దరఖాస్తు దాఖలు చేశారు. అనుమతి వస్తే ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులపై దీన్ని ప్రయోగించనున్నారు.
జంతువులపై ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించడంతో.. ఈ ఔషధానికి అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేశారు. డెంగీ వైరస్ కు ఇప్పటి వరకు చికిత్స లేదు. యాంటీ వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. కాకపోతే డెంగీకి ముందస్తు రక్షణగా టీకా అందుబాటులో ఉండడం గమనించాలి. ఈ ఔషధ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం అందిస్తోంది. డెంగీ చికిత్సకు ఎటువంటి ఔషధం లేకపోవడంతో దీన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పరిశోధన బృందం పనిచేస్తోంది.