Nadendla Manohar: కారు ఆపి దిగి పోలీసులతో జ‌న‌సేన నేత నాదెండ్ల తీవ్ర‌ వాగ్వివాదం.. వీడియో ఇదిగో

Nadendla Manohar slams police

  • రేపు ఇప్ప‌టం గ్రామంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌
  • పోలీసులు ఫ్లెక్సీలు తీసేస్తున్నార‌ని నాదెండ్ల మండిపాటు
  • త‌న క‌ళ్ల‌తో చూశాన‌ని చెప్పిన నేత‌
  • తాము తీయ‌లేద‌ని చెప్పిన పోలీసులు

ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ వేడుక‌లు రేపు గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. పార్టీ ఆవిర్భావ వేడుక‌లకు ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు ఏపీ పోలీసులు అనుమ‌తి కూడా ఇచ్చారు. అయితే, జనసేన ఆవిర్భావ సభా వేదిక వ‌ద్ద ఏర్పాట్లు ప‌రిశీలించేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ విజయవాడ క‌న‌క‌దుర్గ వార‌ధిపై పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

అక్క‌డ‌ పెట్టిన జనసేన ఫ్లెక్సీలను పోలీసులే స్వ‌యంగా తొల‌గిస్తున్నార‌ని, తానే ఈ ఘ‌ట‌న‌ను స్వ‌యంగా చూశాన‌ని అన్నారు. కారులోంచి దిగి పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగారు. అధికార వైసీపీ నేత‌ల ఒత్తిడి వ‌ల్లే త‌మ పార్టీ ఫ్లెక్సీల‌ను పోలీసులు తొలగిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే, తాము ఆ ఫ్లెక్సీల‌ను తీయ‌లేద‌ని పోలీసులు చెప్పారు.

అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని, ట్రాఫిక్ ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌ని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులపై నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌రింత మండిప‌డ్డారు. ఇక్క‌డ ట్రాఫికే లేక‌పోతే ట్రాఫిక్ ఉల్లంఘ‌న ఎలా జ‌రుగుతుంద‌ని ఆయ‌న నిల‌దీశారు. వైసీపీ నేత‌ల ఫ్లెక్సీలు క‌డితే కూడా ఇలాగే తొల‌గిస్తారా? అని జ‌న‌సేన నేత‌లు మండిప‌డ్డారు. 

త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌కూడ‌ద‌ని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కాగా, జ‌న‌సేన ఆవిర్భావ స‌భ వ‌ద్ద‌కు వెళ్లే దారుల్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రేప‌టి స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News