Devegowda: కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ.. కర్ణాటకలోనూ ఒంటరి పోరే.. పొత్తుకు జేడీఎస్ విముఖం
- కాంగ్రెస్ తో పొత్తు మాకొద్దు
- అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం
- పార్టీని బలోపేతం చేసుకుంటాం
- జేడీఎస్ అధినేత దేవెగౌడ
ఒక్కో రాష్ట్రంలో పతనం అవుతూ.. రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైన కాంగ్రెస్.. రానున్న ఏడాది కాలంలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల్లో విషమ పరీక్షను ఎదుర్కోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ అధికారం చలాయించినవే.
ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ సర్కారును గద్దెదించాలనుకుంటున్న కాంగ్రెస్ కు జేడీఎస్ తోడు వచ్చే అవకాశాలు లేవని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్వయంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును పరిశీలిస్తారా? అన్న ప్రశ్నకు.. మేము అటువంటి భాగస్వామ్యాల గురించి ఆలోచించడం లేదు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుని పార్టీని బలోపేతం చేసుకుంటాం’’అని దేవెగౌడ ప్రకటించారు.
‘‘పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి.. రైతుల ఆందోళన, పార్టీ అంతర్గత అంశాలు కారణం. ఇది ఆప్ కు చక్కని అవకాశంగా మారింది. పంజాబ్ ప్రజలు బీజేపీని ఎంపిక చేసుకోలేదు’’అని దేవెగౌడ తన అభిప్రాయాలను వెల్లడించారు. మూడు పార్టీల మధ్య పోరుతో కర్ణాటకలో ఫలితం ఎవరికి అనుకూలిస్తుందో చూడాలి. మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామన్న నమ్మకంతో సీఎం బస్వరాజ్ బొమ్మై ఉన్నారు.