Vishnu Vardhan Reddy: భారత రక్షణ బలగాలను బెదిరించే సాహసం చేయడం సిగ్గుచేటు కేటీఆర్ గారూ!: ఏపీ బీజేపీ నేత విష్ణు
- అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందన
- కంటోన్మెంట్ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం
- ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శలు
- నీళ్లు, విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిక
- కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న విష్ణు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను విష్ణు తప్పుబట్టారు. కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో మిలిటరీ వర్గాలు ఇష్టానుసారం రోడ్లను మూసివేస్తున్నాయని, కంటోన్మెంట్ అంటే స్వతంత్ర దేశం అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా నీళ్లు, విద్యుత్ బంద్ చేయగలమని, అప్పుడైనా కంటోన్మెంట్ అధికారులు దిగిరారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, మీ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ నేతలను బుజ్జగించేందుకు ఏకంగా భారత రక్షణ బలగాలను బెదిరించే సాహసం చేయడం సిగ్గుచేటు కేటీఆర్ గారూ! అంటూ విమర్శించారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, రక్షణ దళాలకు నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేస్తామని చెప్పడమంటే, దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను కించపరిచినట్టేనని స్పస్టం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత రక్షణ బలగాలను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.