Pawan Kalyan: రేపు సభాముఖంగా అందరికీ, అన్నిటికీ సమాధానం చెబుతా!: పవన్ కల్యాణ్

Pawan Kalyan invites everyone to Janasena emergence day meeting

  • మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ
  • ఇప్పటం గ్రామంలో సభా వేదిక
  • అందరికీ ఆహ్వానం పలికిన పవన్ కల్యాణ్
  • ఒక బలమైన సందేశం పంపిస్తామని వెల్లడి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఈ నెల 14న మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందరికీ ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని, మార్చి 14న 9వ ఏట అడుగుపెడుతోందని వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ సభ కోసం జనసేన నాయకులు గత 10 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అందరూ తమ తమ ప్రాంతాల నుంచి క్షేమంగా ఇక్కడికి చేరుకుని సభను జయప్రదం చేయాలని కోరుతున్నట్టు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని, గత రెండున్నరేళ్లలో ఏమేం జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం? అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

సభకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఇది మా హక్కు అని చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది మన ఆవిర్భావ దినోత్సవం, ఇది మన హక్కు... ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని ఉద్ఘాటించారు. పోలీసు శాఖ వారు కూడా సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. గతంలో తమపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి రేపు సభాముఖంగా సమాధానం చెబుతానని అన్నారు. సభా వేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరుపెట్టామని, ఆయన స్ఫూర్తిగానే సభ సాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News